భద్రాద్రి.. ఆన్‌లైన్‌లో ఉత్తరద్వార దర్శనం టికెట్లు

వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాలలో భాగంగా జనవరి 5న స్వామివారి తెప్పోత్సవం, 6న ఉత్తర ద్వార దర్శనం వేడుక నిర్వహించనున్న నేపథ్యంలో ముక్కోటి విజయవంతానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి జీ.నరసింహులు వెల్లడించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో నమస్తేతెలంగాణకు పలు విషయాలు వెల్లడించారు.


ముక్కోటి ఏర్పాట్లపై ఈనెల 19న భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుందని, ఈసమావేశంలో వివిధ పనులను ఆయాశాఖల అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. రూ.80లక్షలతో ముక్కోటికి వివిధ పనులను చేపట్టి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రూ.45లక్షలతో 15 తాత్కాలిక పనులను చేపడుతున్నామని, ఇప్పటికే అన్ని పనులకు టెండర్లు పూర్తి చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చామన్నారు. పెయింటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ముక్కోటి పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఆహ్వాన పత్రికలు, పోస్టర్లు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, త్వరలోనే అవి అందగానే ముక్కోటి ప్రచారాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.